Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

28వ అధ్యాయము

1  మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలిసికొంటిమి. 
2  అనాగరికులగు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచార మింతంతకాదు. ఏలాగనగా, అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పురాజబెట్టి మమ్మును అందరిని చేర్చుకొనిరి. 
3  అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పులమీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి కరచి పట్టెను. 
4  ఆ ద్వీపవాసులు ఆ జంతువతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడ - నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు; ఇతని బ్రదుకనియ్యదని తమలోతాము చెప్పుకొనిరి. 
5  అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించివేసి యే హానియు పొందలేదు. 
6  వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ తాత్పర్యము మాని - ఇతడొక దేవత అని చెప్పసాగిరి. 
7  పొప్లియ అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని మూడు దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చెను. 
8  అప్పుడు పొప్లియయొక్క తండ్రి జ్వరముచేతను రక్తభేదిచేతను బాధపడుచు పండుకొనియుండెను. పౌలు అతనియొద్దకు వెళ్లి ప్రార్థన చేసి, అతనిమీద చేతులుంచి స్వస్థపరచెను. 
9  ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడ వచ్చి స్వస్థతపొందిరి. 
10  మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి, మేము ఓడఎక్కి వెళ్లినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చిఓడలో ఉంచిరి. 
11  మూడు నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతకాలమంతయు గడిపిన అశ్వినీ చిహ్నముగల అలెక్సంద్రియ పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి 
12  సురకూసైకి వచ్చి అక్కడ మూడు దినములుంటిమి 
13  అక్కడ నుండి చుట్టు తిరిగి రేగియకు వచ్చి యొక దినమైన తరువాత దక్షిణపుగాలి విసరుటవలన మరునాడు పొతియొలీకి వచ్చితిమి. 
14  అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమయొద్ద ఏడు దినములుండవలెనని మమ్మును వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. 
15  అక్కడనుండి సహోదరులు మా సంగతి విని అప్పీయ సంతపేటవరకును త్రిసత్రములవరకును మమ్మును ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. 
16  మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలియున్న రాణువవానితోకూడ ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను 
17  మూడు దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైనవారిని తనయొద్దకు పిలిపించెను. వారు కూడివచ్చినప్పుడతడు - సహోదరులారా, నేను మనప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియు చేయకపోయినను, యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖయిదీగా అప్పగించబడితిని. 
18  వీరు నన్ను విమర్శచేసి నాయందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్నువిడుదల చేయగోరిరి గాని 
19  యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందుననవలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనముమీద నేరమేమియు మోపవలెనని నా తాత్పర్యముకాదు; 
20  ఈ హేతువుచేతనే మిమ్మును చూచి మాటలాడ వలెనని పిలిపించితిని; ఇశ్రాయేలుయొక్క నిరీక్షణకోసరము ఈ గొలుసుతో కట్టబడియున్నానని వారితో చెప్పెను. 
21  అందుకు వారు - యూదైయనుండి నిన్నుగూర్చి పత్రికలు మాకు రాలేదు; ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్నుగూర్చి చెడుసంగతి ఏదియు మాకు తెలియపరచను లేదు, మరియు ఎవరును చెప్పుకొనను లేదు. 
22  అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీవలన వినగోరుచున్నాము; ఈ మతభేదమునుగూర్చి అంతట ఆక్షేపణచేయుచున్నారని (యింతమట్టుకు) మాకు తెలియుననిరి. 
23  అతనికి ఒక దినము నియమించి, అతని బసలోకి అతనియొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయమునుండి సాయంకాలమువరకు అతడు దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములో నుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. 
24  అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయిరి. 
25  వారిలో విభేదమైన అభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్లిపోయిరి. అదేదనగా 
26  -మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు; చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని యీ ప్రజలయొద్దకు వెళ్లి చెప్పుము. 
27  ఈ ప్రజలు కన్నులార చూచి చెవులారా విని మనస్సార గ్రహించి నా వైపు తిరిగి నావలన స్వస్థత పొందుకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసికొనియున్నారు. అని పరిశుద్ధాత్మ యెషయాప్రవక్తద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. 
28-29. కాబట్టి దేవునివలననైన యీ రక్షణ అన్యజనులయొద్దకు పంపబడియున్నదని మీరు తెలిసికొందురు గాక, వారు దాని విందురు. 2
30  పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దెయింట కాపురముండి, తనయొద్దకు వచ్చువారినందరిని సమ్మానముచేసి 
31  ఏ ఆటంకమునులేక పూర్ణధైర్యముతో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. 

Download Audio File

No comments:

Post a Comment