Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

21వ అధ్యాయము

1  మేము వారిని విడిచిపెట్టి ఓడ యెక్కి తిన్నగా వెళ్లి కోసుకును, మరునాడు రొదుకును, అక్కడనుండి పతరకును వచ్చితిమి. 
2  అప్పుడు ఫేనీకేకు వెళ్లబోవుచున్న ఒక ఓడను చూచి అది యెక్కి బయలుదేరితిమి. 
3  కుప్రకు ఎదురుగా వచ్చి, దానిని ఎడమతట్టున విడిచి సురయవైపుగా వెళ్లి, తూరులో దిగితిమి; అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసియుండెను. 
4  మేమక్కడనున్న శిష్యులను కనుగొని యేడుదినములక్కడ ఉంటిమి. వారు - నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మద్వారా పౌలుతో చెప్పిరి. 
5  ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా, భార్యలతోను పిల్లలతోను వారందరు మమ్మును పట్టణము వెలపలివరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్రతీరమున మోకాళ్లూని ప్రార్థనచేసి యొకరియొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి. 
6  అంతట మేము ఓడ ఎక్కితిమి, వారు తమ తమ యిండ్లకు తిరిగి వెళ్లిరి. 
7  మేము తూరునుండి చేసిన ప్రయాణము ముగించి, తొలెమాయికి వచ్చి, సహోదరులను కుశలమడిగి వారియొద్ద ఒక దినముంటిమి. 
8  మరునాడు మేము బయలుదేరి కైసరైయకు వచ్చి, యేడుగురిలో సువార్తికుడైన ఫిలిప్పు యింట ప్రవేశించి తన యొద్ద ఉంటిమి. 
9  కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవంచించువారు. 
10  మేమనేక దినములక్కడ ఉండగా, అగబు అను ఒక ప్రవక్త యూదైయనుండి వచ్చెను. 
11  అతడు మాయొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, తన చేతులను కాళ్లను కట్టుకొని - యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి అన్యజనులచేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. 
12  ఈ మాట వినినప్పుడు మేమును అక్కడివారును - యెరూషమేముకు వెళ్లద్దని అతని బతిమాలుకొంటిమి గాని 
13  పౌలు - ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషమేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. 
14  అతడు ఒప్పుకొననందున మేము - ప్రభువు చిత్తము జరుగుగాక అని ఊరకుంటిమి. 
15  ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసికొని యెరూషలేముకు తర్లిపోతిమి. 
16  మరియు కైసరైయనుండి కొందరు శిష్యులు, మొదటనుండి శిష్యుడుగా ఉండిన కుప్రీయుడైన మ్నాసోను ఇంట మేము దిగవలెనను ఉద్దేశముతో అతని వెంటబెట్టుకొని మాతో కూడ వచ్చిరి. 
17  మేము యెరూషలేముకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మును సంతోషముతో చేర్చుకొనిరి. 
18  మరునాడు పెద్దలందరు అక్కడికి వచ్చియుండగా పౌలు మాతో కూడ యాకోబునొద్దకు వచ్చెను. 
19  అతడు వారిని కుశలమడిగి, తన పరిచర్యవలన దేవుడు అన్యజనులలో జరిగించినవాటిని వివరముగా తెలియజెప్పెను. 
20  వారు విని దేవుని మహిమపరచి అతని చూచి - సహోదరుడా, యూదులలో విశ్వాసులైనవారు ఎన్నివేలమంది యున్నారో చూచుచున్నావుగదా? వారందరు ధర్మశాస్త్రమందు ఆసక్తిగలవారు. 
21  అన్యజనులలో ఉన్నయూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారములచొప్పున నడవకూడదనియు నీవు చెప్పుటవలన వారందరు మోషేను విడిచిపెట్టవలెనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్నుగూర్చి వర్తమానము వినియున్నారు. 
22  కావున మనమేమి చేయుదము? నీవు వచ్చినసంగతి వారు తప్పక విందురు. 
23  కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము. మ్రొక్కుబడియున్న నలుగురు మనుష్యులు మాయొద్ద ఉన్నారు. 
24  నీవు వారిని వెంటబెట్టుకొనిపోయి వారితో కూడశుద్ధి చేసికొని, వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారికయ్యెడి తగులుబడి పెట్టుకొనుము; అప్పుడు తాము నిన్నుగూర్చి వినిన వర్తమాననము నిజము కాదనియు, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలిసికొందురు 
25  అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి - వారు విగ్రహార్పితమైన వాటిని రక్తమును గొంతు పిసికి చంపినదానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసియున్నామని చెప్పిరి. 
26  అంతట పౌలు మరునాడు ఆ మనుష్యులను వెంటబెట్టుకొని పోయి వారితోకూడ శుద్ధిచేసికొని దేవాలయములో ప్రవేశించి, వారిలో ప్రతివానికొరకు కానుక అర్పించువరకు శుద్ధి దినములు నెరవేర్చుదుమని తెలిపెను. 
27  ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియనుండివచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి, సమూహమంతటిని కలవరపరచి అతని బలాత్కారముగా పట్టుకొని 
28  - ఇశ్రాయేలీయులారా, సహాయముచేయ రండి; ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు హెల్లేనీయులను దేవాలయములోకి తీసికొనివచ్చి యీ పరశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలువేసిరి,. 
29  ఏలయనగా ఎఫెసీయుడైన త్రోపిమును అతనితో కూడ పట్టణములో అంతకుముందు వారు చూచియున్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసికొని వచ్చెనని ఊహించిరి. 
30  పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తివచ్చి పౌలును పట్టుకొని దేవాలయములోనుండి అతని వెలపలికి ఈడ్చిరి; వెంటనే తలుపులు మూయబడెను. 
31  వారతని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు సహస్రాధిపతికి వర్తమానము వచ్చెను; 
32  వెంటనే అతడు రాణువవారిని శతాధిపతులను వెంటబెట్టుకొని వారియొద్దకు పరుగెత్తివచ్చెను; వారు సహస్రాధిపతిని రాణువవారిని చూచి పౌలును కొట్టుట మానిరి. 
33  సహస్రాధిపతి దగ్గరకు వచ్చి అతని పట్టుకొని, రెండు సంకెళ్లతో బంధించుమని ఆజ్ఞాపించి - ఇతడెవడు, ఏమి చేసెనని అడుగగా, 
34  సమూహములో కొందరీలాగు కొందరాలాగు కేకలువేయుచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలిసికొనలేక కోటలోకి అతని తీసికొనిపొమ్మని ఆజ్ఞాపించెను. 
35  పౌలు మెట్లమీదికి వచ్చినప్పుడు జనులు గుంపుకూడి బలాత్కారము చేయుచున్నందున రాణువవారు అతని మోసికొని పోవలసి వచ్చెను. 
36  ఏలయనగా - వాని చంపుమని జనసమూహము కేకలువేయుచు వెంబడించెను. 
37  వారు పౌలును కోటలోకి తీసికొనిపోనై యుండగా అతడు సహస్రాధిపతిని చూచి - నేను నీతో ఒకమాట చెప్పవచ్చునా అని అడిగెను. అందుకతడు - హెల్లేనీయ భాష నీకు తెలియునా? 
38  ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి, నరహంతకులైన నాలుగువేలమంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవుకావా అని అడిగెను. 
39  అందుకు పౌలు - నేను కిలికియలోని తార్సువాడనైన యూదుడను; ఆ ప్రసిద్ధపట్టణపు పౌరత్వము నాకు కలదు. జనులతో మాటలాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పెను. 
40  అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్లమీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీభాషలో ఇట్లనెను - 
Download Audio File

No comments:

Post a Comment