Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

18వ అధ్యాయము

1  అటుతరువాత పౌలు అతేనైనుండి బయలుదేరి కొరింథుకు వచ్చి, పొంతులో పుట్టిన అకుల అను ఒక యూదుని అతని భార్యయైన ప్రిస్కిల్లను కనుగొని వారియొద్దకు వెళ్లెను. 
2  యూదులందరు రోమా విడిచి వెళ్లిపోవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇతలియనుండి క్రొత్తగా వచ్చినవారు. 
3  వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కావురముండెను; వారు కలిసి పని చేయుచుండిరి. 
4  అతడు ప్రతి విశ్రాంతిదినమున సామాజమందిరములో తర్కించుచు, యూదులను హెల్లేనీయులను ఒప్పించుచుండెను. 
5  సీలయు తిమొథెయు మకెదొనియనుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై, యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. 
6  వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని - మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. 1నేను నీర్దోషిని; యికమీదట అన్యజనులయొద్దకు పోవుదునని వారితో చెప్పి 
7  అక్కడనుండి వెళ్లి, దేవుని యందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని యింటికి వచ్చెను. అతిని యిల్లు సమాజమందిరమును ఆనుకొనియుండెను. 
8  ఆ సమాజమందిరపు అధికారియైన క్రిస్పు తన యింటి వారందరితోకూడ ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. 
9  ప్రభువు రాత్రివేళ దర్శనమందు -నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము 
10  నేను నీకు తోడైయున్నాను, నీకు హానిచేయుటకు నీమీదకి ఎవడును రాడు; ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా 
11  అతడు వారిమధ్య దేవుని వాక్యము బోధించుచు, ఒక సంవత్సరము మీద ఆరునెలలు అక్కడ నివసించెను. 
12  గలియోను అకైయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలుమీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసికొని వచ్చి 
13  - వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. 
14  పౌలు నోరు తెరచి మాటలాడబోగా గల్లియోను - యూదులారా, యిదియొక అన్యాయము గాని చెడ్డ నేరము గాని యైనయెడల నేను మీ మాట సహనముగా వినుటన్యాయమే. 
15  ఇది యేదోయొక ఉపదేశమును గూర్చియునైనను, పేళ్లను గూర్చియునైనను, మీ ధర్మశాస్త్రమును గూర్చియునైనను వాదమైతే మీరే దాని చూచుకొనుడి; ఈలాటి సంగతులనుగూర్చి విమర్శచేయుటకు నాకు మనస్సులేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠము ఎదుటనుండి తోలివేసెను. 
16-17. అప్పుడందరు సమాజమందిరపు అధికారియైన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్టసాగారి. అయితే గలియోను వీటిలో ఏ సంగతినిగూర్చియు లక్ష్యపెట్టలేదు. 
18  పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహాదరులయొద్ద సెలవు పుచ్చుకొని, తనకు మొక్కుబడి యున్నందున కెంక్రెయలో తలవెండ్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సురియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితోకూడ వెళ్లిరి. 
19  వారు ఎఫెసుకు వచ్చినప్పుడు అతడు వారి నక్కడ విడిచిపెట్టి, తానుమాత్రము సమాజమందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. 
20-21. వారింక కొంతకాలముండుమని అతని వేడుకొనగా అతడు ఒప్పక - దేవుని చిత్తమైతే మీయొద్దకు తిరిగి వత్తునని చెప్పి, వారియొద్ద సెలవు పుచ్చుకొని ఓడయెక్కి ఎఫెసునుండి బయలుదేరెను. 
22  తరువాత కైసరైయ రేవున దిగి వెళ్లి సంఘపువారిని కుశలమడిగి అంతియొకైయకు వచ్చెను. 
23  అక్కడ కొంతకాలముండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయప్రాంతమందును ప్రుగియయందును సంచరించుచు శిష్యులనందరిని స్థిరపరచెను. 
24  అలెక్సంద్రియలో పుట్టిన అపొల్లో అను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై యుండెను. 
25  అతడు ప్రభువుమార్గము విషయమై ఉపదేశముపొంది తన ఆత్మయందు తీవ్రపడి, యోహాను బాప్తిస్మము మాత్రమే తెలిసికొనినవాడైనను, యేసునుగూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజమందిరములో ధైర్యముగా మాటలాడ నారంభించెను. 
26  ప్రిస్కిల్ల అకులయు విని, అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. 
27  తరువాత అతడు అకైయకు పోదలచినప్పుడు సహోదరులు అతని చేర్చుకొనవలెనని ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడిక్కడికి వచ్చి (దైవ) కృపచేత విశ్వసించినవారికి చాల సహాయముచేసెను. 
28  యేసే క్రీస్తు అని లేఖనములద్వారా అతడు దృష్టాంతపరచి, బహిరంగమందు యూదులవాదమును గట్టిగా ఖండించుచు వచ్చెను. 
Download Audio File

No comments:

Post a Comment