Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

1వ అధ్యాయము

1-2. ఓ థెయొఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినిగూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. 
3  ఆయన శ్రమపడిన తరువాత నలువది దినముల పర్యంతము వారికగుపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములనుచూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను. 
4  ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను - మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి; 
5  యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్దిదినములలోగా మీరు పరిశుద్ధాత్మలోబాప్తిస్మముపొందెదరనెను. 
6  కాబట్టి వారు కూడివచ్చినప్పుడు - ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా ఆయన 
7  - కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొనియున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు. 
8  అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదైయ సమరైయ దేశములయందంతటను భూదిగంతములవరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను. 
9  ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను; అప్పుడు ఒక మేఘము వచ్చి వారి కన్నులకు కనబడకుండ ఆయనను కొనిపోయెను. 
10  ఆయన వెళ్లుచుండగా వారు ఆకాశమువైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని వస్త్రములు ధించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి 
11  - గలిలైయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీ యొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే యే రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. 
12  అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేముకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది. 
13  వారు (పట్టణములో) ప్రవేశించి తాము బసచేయుచుండిన మేడగదిలోకి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, మతాభిమానియను సీమోను, యాకోబు కుమారుడగుయూదా అనువారు. 
14  వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును, ఏకభావముగా ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 
15  ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరువదిమంది సహోదరులు కూడియుండగా పేతురు వారి మధ్యనిలిచి యిట్లనెను 
16  - సహోదరులారా, యేసును పట్టుకొనినవారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను. 
17  అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను. 
18  ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకలనిచ్చి యొక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటకి వచ్చెను. 
19  ఈ సంగతి యెరూషలేములో కాపురమున్నవారికందరికి తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా 
20  - అతని యిల్లు పాడైపోవుగాకదానిలో ఎవడును కాపురముండక పోవుగాకఅతని యుద్యోగము వేరొకడు తీసికొనునుగాకఅని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది
21-22. కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మనయొద్దనుండి పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు, ఆయన మనమధ్య సంచరించుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతోకూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియై యుండుట అవశ్యమని చెప్పెను. 
23  అప్పుడు వారు యూస్తు అను మారుపేరుగల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి 
24  ఇట్లని ప్రార్థనచేసిరి - అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా, 
25  తనచోటికి పోవుటకు యూదాతప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనుపరచుమనిరి. 
26  అంతట వారు వీరినిగూర్చి చీట్లువేయగా మత్తీయపేరట చీటివచ్చెను గనుక అతడు పదకొండుమంది అపొస్తలులతో కూడ లెక్కింపబడెను. 
Download Audio File

2వ అధ్యాయము

1  పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి. 
2  అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి ఆకస్మాత్తుగా కలిగి, వారు కూర్చుండియున్న యిల్లంతయు వ్యాపించెను. 
3  మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొకనిమీద వ్రాలగా 
4  అందరు పరిశద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ఛక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. 
5  ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములోనుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. 
6  ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. 
7  అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి - ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలైయులు కారా? 
8  మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపుభాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి? 
9  పార్తేయులు మాదీయులు ఏలామీయులు మెసొపొతమియు యూదైయ కపదొకియ పొంతు ఆసియ ప్రుగియ పంపులియ ఐగుప్తు అను దేశములయందలివారు, 
10  కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చియున్న యూదులు, యూదమత ప్రవిష్టులు, 
11  క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. 
12  అందరు విభ్రాంతినొంది యెటుతోచక ఇదేమగునో అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. 
13  కొందరైతే - వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి. 
14  అయితే పేతురు ఆ పదునొకరితోకూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను - యూదైయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులార, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. 
15  మీరు ఊహించునట్టు వీరు మత్తులుకారు, ప్రొద్దుపొడిచి జామయిన కాలేదు. 
16  యోవేలు ప్రవక్తద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా 
17  - అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమమారైలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు, 
18  ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్లమీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవంచించెదరు 
19  పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను. 
20  ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగను చంద్రుడు రక్తముగాను మారుదురు, 
21  అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయువారందరును రక్షణపొందుదురు1 అని దేవుడు చెప్పుచున్నాడు. 
22  ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనుపరచెను; ఇది మీరే యెరుగుదురు. 
23  దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేతసిలువవేయించి చంపితిరి. 
24  మరణము ఆయనను బంధించియుండుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు నివారణచేసి ఆయనను లేపెను 
25  ఆయననుగూర్చి దావీదు ఇట్లనెను- నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నాకుడిపార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను. 
26  కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడ నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. 
27  నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు. 
28  నాకు జీవమార్గములు తెలిపితివి నీదర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. 3
29  సహోదరులారా, మూలపురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగ మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను; అతని గోరీనేటివరకు మనమధ్య ఉన్నది. 
30  అతడు ప్రవక్తయై యుండెను గనుక - అతని గర్భఫలములోనుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదును అనిదేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరిగి 
31  క్రీస్తుపాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమునుగూర్చి చెప్పెను. 
32  ఈ యేసును దేవుడు లేపెను; దీనికిమేమందరము సాక్షులము. 
33  కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీని కుమ్మరించియున్నాడు. 
34  దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు; అయితే అతడిట్లనెను - 
35  నేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠముగా ఉంచుపర్యంతము నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. 4
36  మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువు గాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను. 
37  వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని- సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా 
38  పేతురు - మీర మారుమనస్సుపొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. 
39  ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను. 
40  మరియు ఇంక అనేకవిధములైన మాటలతో సాక్ష్యమిచ్చి - మీరు మూర్ఖులగుఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. 
41  కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి; ఆ దినమందు ఇంచుమించు మూడు వేలమంది చేర్చబడిరి. 
42  వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. 
43  అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములును సూచకక్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను. 
44  విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. 
45  ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి. 
46  మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటరొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై 
47  ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము చేర్చుచుండెను. 
Download Audio File

3వ అధ్యాయము

1  పగలు మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు వెళ్లుచుండగా, 
2  పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను వాడు దేవాలయములోకి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. 
3  పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా 
4  పేతురును యోహానును వాని తేరి చూచి - మాతట్టు చూడుమనిరి. 
5  వాడు వారి యొద్ద ఏమైన దొరకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను. 
6  అంతట పేతురు - వెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను; నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి 
7  వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను. 
8  వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోకి వెళ్లెను. 
9  వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరుచూచి 
10  శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగినదాని చూచి విస్మయముతో నిండినవారై పరవశులైరి. 
11  వాడు పేతురును యోహానును పట్టుకొని యుండగా ప్రజలందరు విస్మయమొంది, సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి. 
12  పేతురు దీని చూచి ప్రజలతో ఇట్లనెను - ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా స్వశక్తిచేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు? 
13  అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతనియెదుట ఆయనను నిరాకరించితిరి. 
14  మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వాని నిరాకరించి, నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. 
15  మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకుమేము సాక్ష్యులము. 
16  ఆయన నామమందలి విశ్వాసముమూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను, ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వీనికి ఈ సర్వాంగపుష్టి కలుగజేసెను. 
17  సహోదరులారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును. 
18  అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలనోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చెను. 
19  ప్రభువు సముఖమునుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును 
20  మీ కొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సునొంది తిరుగుడి. 
21  అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. అంతపర్యంతము యేసు పరలోక నివాసియైయుండుట అవశ్యకము. 
22  మోషే యిట్లనెను- ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమిచెప్పినను అన్నివిషయములలో మీరాయన మాట వినవలెను
23  ఆ ప్రవక్తమాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను. 
24  మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి. 
25  ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో - నీ సంతానమందు భూలోకవంశములన్నియు అశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులైయున్నారు. 
26  దేవుడు తన సేవకుని పుట్టించి, 5మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్మునాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను. 
Download Audio File

4వ అధ్యాయము

1-2. వారు ప్రజలతో మాటలాడుచుండగా యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును వారు ప్రజలకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి 
3  వారిని బలాత్కారముగా పట్టుకొని, సాయంకాలమైనందున మరునాటివరకు వారిని కావలిలో ఉంచిరి. 
4  వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య యించుమించు అయిదు వేలు ఆయెను. 
5  మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి. 
6  ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరును వారితోకూడ ఉండిరి. 
7  వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి - మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీని చేసితిరని అడుగగా 
8  పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను - ప్రజల అధికారులారా, పెద్దలారా, 
9  ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక 
10  మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొన వలసినదేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియునైన నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వాడు స్వస్థతపొందినవాడై మీ యెదుట నిలుచుచున్నాడు. 
11  ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను. 6
12  మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెనుగాని, ఆకాశముక్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. 
13  వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులనిగ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి. 
14  స్వస్థతపొందిన ఆ మనుష్యుడు వారితో కూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి. 
15  అప్పుడు - సభ వెలిపలికి పొండని వారి కాజ్ఞాపించి తమలోతాము ఆలోచన చేసి 
16  ఈ మనుష్యులను మనమేమి చేయుదుము? వారిచేత ప్రసిద్ధమైన సూచకక్రియ చేయబడియున్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికి ప్రత్యక్షమే; అది జరుగలేదని చెప్పజాలము. 
17  అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుడుటకై - ఇకమీదట ఈ నామమునుబట్టి యే మనుష్యునితో నైనను మాటలాడకూడదని మనము వారిని బెదరు పెట్టవలెనని చెప్పుకొనిరి. 
18  అప్పుడు వారిని పిలిపించి - మీరు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, బోధింపను కూడదని వారికాజ్ఞాపించిరి. 
19  అందుకు పేతురును యోహానును వారిని చూచి - దేవుని మాటవినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టకి న్యాయమా? మీరే చెప్పుడి; 
20  మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. 
21  ప్రజలందరు జరిగినదానిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి 
22  స్వస్థపరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చెయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఏక్కువ వయస్సుగలవాడు. 
23  వారు విడుదల నొంది తమ స్వజనులయొద్దకు వచ్చి, ప్రధానయాజకులును పెద్దలును తమతో చెప్పిన మాటలనన్నిటిని వారికి తెలిపిరి. 
24  వారు విని, యేకమనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. - నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు. 
25  -అన్యజనులు ఏల గల్లత్తు చేసిరి 
26  ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరిప్రభువు మీదను ఆయన క్రీస్తుమీదనుభూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరిఅని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదునోట పలికించితివి. 2
27-28. ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదును పొంతింపిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. 
29  ప్రభువా, ఈ సమయమున వారి బెదరింపులు చూచి 
30  రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము. 
31  వారు ప్రార్థనచేయగానే వారు కూడియున్నచోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. 
32  విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగినవాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. 
33  ఇదియుగాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమునకు సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను. 
34  భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మినవాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచువచ్చిరి. 
35  వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను. 
36  కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపొస్తలులు, హెచ్చరిక చేయువాడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమిగలవాడైయుండి దానిని అమ్మి 
37  దాని వెల తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను. 
Download Audio File

5వ అధ్యాయము

1  అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. 
2  భార్య యెరుకయే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను. 
3  అప్పుడు పేతురు - అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? 
4  అది నీయొద్దనున్నప్పుడు నీదేగదా? అమ్మిన పిమ్మట అది నీ వశమైయుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. 
5  అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారికందరికిని మిగుల భయము కలిగెను; 
6  అప్పుడు యౌవనస్థులు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి. 
7  ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. 
8  అప్పుడు పేతురు - మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె - అవును ఇంతకే అని చెప్పెను. 
9  అందుకు పేతురు - ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొని పోవుదురని ఆమెతో చెప్పెను. 
10  వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ యౌవనస్థులు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి. 
11  సంఘమంతటికిని, ఈ సంగతులు వినినవారికందరికిని మిగుల భయము కలిగెను. 
12  ప్రజలమధ్య అనేకమైన సూచకక్రియలును మహత్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. 
13  కడమవారిలో ఎవడును వారితో కలిసికొనుటకు తెగింపలేదు గాని 
14  ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. 
15  అందుచేత పేతురు వచ్చుచుండగా జనములు రోగులను వీధులలోకి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచముల మీదను పరుపులమీదను వారిని ఉంచిరి. 
16  మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడినవారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థతపొందిరి. 
17  ప్రధానయూజకుడును అతనితోకూడ ఉన్నవారందరును, అనగా సద్దూకైయుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని 
18  అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. 
19  అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలపలికి తీసికొని వచ్చి - మీరు వెళ్లిదేవాలయములో నిలువబడి 
20  ఈ జీవమునుగూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడని వారితో అనెను. 
21  వారామాట విని, తెల్లవారగానే దేవాలయములోకి వెళ్లి బోధించుచుండిరి. ప్రధానయాజకుడును అతనితోకూడ నున్నవారును వచ్చి, మహా సభవారిని ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పిలువనంపించి - వారిని తోడుకొని రండని బంట్రౌతులను బందీగృహమునకు పంపిరి. 
22  బంట్రౌతులు అక్కడికి వెళ్లినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగివచ్చి 
23  - బందీగృహము బహు భద్రముగా మూసియుండుటయు, కావలివారు తలుపులముందర నిలిచియుండుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి. 
24  అంతట దేవాలయపు అధిపతియు ప్రధానయాజకులును ఆ మాటలు విని - ఇది యేమవునో అని వారివిషయమై యెటుతోచక యుండిరి. 
25  అప్పుడొకడు వచ్చి - ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా 
26  అధిపతి బంట్రౌతులతోకూడ పోయి, ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి, బలాత్కారము చేయకయే వారిని తీసికొని వచ్చెను. 
27  వారిని తీసికొనివచ్చి సభలో నిలువబెట్టగా ప్రధానయాజకుడు వారిని చూచి - మీరు ఈ నామమునుబట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్యమామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను. 
28  వారిని తీసికొనివచ్చి సభలో నిలువబెట్టగా ప్రధానయాజకుడు వారిని చూచి - మీరు ఈ నామమునుబట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్యమామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను. 
29  అందుకు పేతురును అపొస్తలులును - మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. 
30  మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. 
31  ఇశ్రాయేలుకు మారుమనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత హెచ్చించి యున్నాడు. 
32  మేమును, దేవుడు తనకు విధేయులైనవారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి. 
33  వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొనివీరిని చంప నుద్దేశించగా 
34  సమస్త ప్రజలవలన ఘనతనొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి - ఈ మనుష్యులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను 
35  - ఇశ్రాయేలీయులారా, యీ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్త సుమండి. 
36  దినములకు మునుపు థూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను; ఇంచుమించు నన్నూరుమంది మనుష్యులు వానితో కలిసికొనిరి, వాడు చంపబడెను, వానికి లోబడినవారందరును చెదరి వ్యర్థులైరి. 
37  వానికి తరువాత జనసంఖ్యదినములలో గలిలైయడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతోకూడ తిరుగబాటు చేయ ప్రేరేపించెను; వాడుకూడ నశించెను, వానికి లోబడినవారందరును చెదరిపోయిరి. 
38  కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా - ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగినదాయెనా అది వ్యర్థమగును. 
39  దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ. 
40  వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించి - యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. 
41  ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడుటవలన వారు సంతోషించుచు మహా సభయెదుటనుండి వెళ్లిపోయి 
42  ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. 
Download Audio File

6వ అధ్యాయము

1  ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద హెల్లేనిస్తులు సణగసాగిరి. 
2  అప్పుడు పన్నెండుగురు అపొస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి - మేము దేవుని వాక్యము బోధించుట మాని ధనముపంచి పెట్టుటయుక్తముకాదు. 
3  కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము; 
4  అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి. 
5  ఈ మాట యావన్మందికి ఇష్టమైనందున వారు, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనినవాడైన స్తెఫనును, ఫిలిప్పు, ప్రోకొరు, నికానొరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతప్రవిష్టుడగు అంతియొకైయ నికొలాను అనువారిని ఏర్పరచుకొని 
6  వారిని అపొస్తలులయెదుట నిలువబెట్టిరి; వీరు ప్రార్థనచేసి వీరమీద చేతులుంచిరి 
7  దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. 
8  స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజలమధ్య మహత్కార్యములను గొప్ప సూచకక్రియలను చేయుంచుండెను. 
9  అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజములోను, కూరెనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలోను, కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని 
10  మాటలాడుటయందు అతడు అగుపరచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. 
11  అప్పుడు వారు - వీడు మోషేమీదను దేవునిమీదను దూషణవాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని 
12  ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి 
13  అతిని పట్టుకొని మహా సభయొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు - ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధస్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు. 
14  ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. 
15  సభలో కూర్చున్నవారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను. 
Download Audio File

7వ అధ్యాయము

1  ప్రధానయాజకుడు - ఈ మాటలు నిజమేనా అని అడిగెను. 
2  అందుకు స్తెఫను చెప్పినదేమనగా - సహోదరులారా తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండకమునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై 
3  - నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. 
4  అప్పుడతడు కల్దీయులదేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడనుండి మీరిప్పుడు కాపురమున్న యీ దేశమందు నివసించుటకై దేవుడతని తీసికొని వచ్చెను. 
5  ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమియైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేన్పపుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దానిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానముచేసెను. 
6  అయితే దేవుడు - అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురనియు, ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరములమట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధపెట్టుదురనియు చెప్పెను. 
7  మరియు దేవుడు - ఏ జనమునకు వారు దాసులై యుందురో ఆ జనమును నేను విమర్శచేయుదుననియు, ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్నుసేవింతురనియు చెప్పెను. 
8  మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతని కనుగ్రహించెనుఅతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతిచేసెను; ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. 
9  ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోకి పోవుటకు అమ్మివేసిరిగాని దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి 
10  దయను జ్ఞానమును ఐగుప్తురాజైన ఫరోయెదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తుకును తన యింటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. 
11  తరువాత ఐగుప్తు దేశమంతటికిని కనాను దేశమంతటకిని కరువును బహు శ్రమయు వచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను. 
12  ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. 
13  వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసికొనెను; అప్పుడు యోసేపుయొక్క వంశము ఫరోకు తెలియనాయెను. 
14  యోసేపు తన తండ్రియైన యాకోబును తన స్వజనులందరిని పిలువనంపెను, వారు డెబ్బది యయిదుగురై యుండిరి. 
15  యాకోబు ఐగుప్తుకు వెళ్లెను; అక్కడ అతడును మన పితరులును చనిపోయి; అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడనుండి; షెకెముకు తేబడి, 
16  షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రాహాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి. 
17  అయితే దేవుడు అబ్రాహాముకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించినకొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధిపొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏల నారంభించెను. 
18  ఇతడు మన వంశస్థులయెడల కపటముగా ప్రవర్తించి 
19  తమ శిశువులు బ్రదుకకుండ వారిని బయట పారవేయవలెనని మనపితరులను బాధపెట్టెను. 
20  ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి యింట మూడు నెలలు పెంచబడెను. 
21  తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతని తీసికొని తనకుమారునిగా పెంచుకొనెను. 
22  మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను. 
23  అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహాదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. 
24  అప్పుడు వారిలో ఒకడు అన్యాయము ననుభవించుట అతడు చూచి వాని రక్షించి బాధపడినవాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతికారముచేసెను. 
25  తనద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. 
26  మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి - అయ్యలారా, మీరు సహోదరులు; మీరెందుకు ఒకనికొకడు అన్యాయము చేసికొనుచున్నారని చెప్పివారిని సమాధానపరచ జూచెను. 
27  అయినను తనపొరుగువానికి అన్యాయము చేసినవాడు - మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించినవాడెవడు? 
28  నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంప దలచియున్నావా అని చెప్పి అతని త్రోసివేసెను. 
29  మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరవాసియైయుండి, అక్కడ ఇద్దరు కుమారులనుకనెను. 
30  నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతరణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగుపడెను. 
31  మోషేచూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా 
32  - నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కువినబడెను గనుక మోషే వణకి, నిదానించి చూచుటకు తెగింపలేదు. 
33  అందుకు ప్రభువు - నీ చెప్పులు విడువుము; నీవు నిలిచియున్నచోటు పరిశుద్ధభూమి 
34  ఐగుప్తులోనున్న నా ప్రజలదురవస్థను నేను నిదానించి చూచితిని; వారి మూలుగువింటిని; వారిని విడిపించుటకు దిగివచ్చియున్నాను; రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుదునని అతనితో చెప్పెను. 2
35  - అధికారినిగాను తీర్పరినిగాను నిన్నునియమించినవాడెవడని వారు నిరాకరించిన యీ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను 
36  ఇతడు ఐగుప్తులోను ఎర్రసముద్రములోను నలువది యేండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచకక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. 
37  - నావంటి యొక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే యితడే. 
38  సీనాయి పర్వతముమీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసికొనినవాడితడే. 
39  ఇతనికి మన పితరులు లోబడనొల్లకయితని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తుకు పోగోరినవారై 
40  - మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము; ఐగుప్తుదేశములోనుండి మనలను తోడుకొనివచ్చిన యీ మోషే యేమాయెనో మాకు తెలియదని అహలోనుతో అనిరి. 
41  ఆ దినములలో వారొక దూడను చేసికొని ఆ విగ్రహమునకు బలి సమర్పించి, తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి. 
42  అందుకు దేవుడు వారికి పరాజ్ముఖుడై ఆకాశసైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడియున్నది. 4-ఇశ్రాయేలు ఇంటివారలారామీరు అరణ్యములో నలువది యేండ్లుబలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా? 
43  మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైనమొలెకు గుడారమును రొంఫాయనుదేవతయొక్క నక్షత్రమును మోసికొని పోతిరిగనుక బాబెలు ఆవలికి మిమ్మును కొనిపోయెదను. 
44  అతడు చూచిన మాదిరిచొప్పున దాని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరులయొద్ద ఉండెను. 
45  మన పితరులు (తమ పెద్దలచేత) దాని తీసికొనినవారై, దేవుడు తమ యెదుటనుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకొన్నప్పుడు, యెహోషువతోకూడ ఈ దేశములోకి దాని తీసికొనివచ్చిరి, అది దావీదు దినములవరకు ఉండెను. 
46  అతడు దేవుని దయపొంది యాకోబుయొక్క దేవునికి నివాసస్థలము కట్టగోరెను. 
47  అయితే సొలొమోను ఆయనకొరకు మందిరము కట్టించెను. 
48-50. అయినను - ఆకాశము నా సింహాసనముభూమి నా పాదపీఠముమీరు నాకొరకు ఏలాటి మందిరమును కట్టుదురు?నా విశ్రాంతి స్థలమేది?ఇవన్నియు నా హస్తకృతములు కావా?అని ప్రభువు చెప్పుచున్నాడుఅని ప్రవక్త పలికిన ప్రకారముసర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. 
51  ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, 6మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. 
52  మీ పితరులు ప్రవక్తలలో ఎవని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందుతెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్యచేసినవారైతిరి. 
53  మీరు దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును పొందితిరి గాని దాని గైకొనలేదని చెప్పెను. 
54  వారు ఈ మాటలు విని అత్యాగ్రహము తెచ్చుకొనిఅతని చూచి పండ్లుకొరికిరి. 
55  అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి 
56  - ఆకాశముతెరువబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. 
57  అప్పుడు వారు పెద్ద కేకలువేసి చెవులు మూసికొని యేకముగా అతనిమీద పడి 
58  పట్టణపు వెలుపలికి అతని వెళ్లగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యౌవనస్థుని పాదములయొద్ద తమవస్త్రములు పెట్టిరి. 
59  ప్రభువునుగూర్చి మొరపెట్టుచు - యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. 
60  అతడు మోకాళ్లూని - ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించినవాడాయెను. 
Download Audio File